
సాక్షి డిజిటల్ న్యూస్ - జూన్ 18- సికింద్రాబాద్- మేదిబావి లోని పాత సెట్విన్ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతున్న ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలను మాజీ కార్పొరేటర్ డా. సామల హేమ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌తో సమావేశమై విద్యార్థులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కొనసాగు తున్నందున తగిన మౌలిక సదుపాయాల లేమితో విద్యార్థులు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రిన్సిపాల్ ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన డా. సామల హేమ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ పద్మారావు గౌడ్ కృషితో కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు నిలిపి వేయబడినట్లు పేర్కొన్నారు. నిధుల విడుదల కోసం ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లడంతో పాటు పలు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు స్పందన రాలేదని అన్నారు.అలాగే ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పలుమార్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌ను కలిసి విన్నవించి నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాను స్వయంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కళాశాల సమస్యలను వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలను తాత్కాలికంగా ఉస్మానియా యూనివర్సిటీలోని అనుకూలమైన భవనానికి మార్చే విషయమై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు డా. సామల హేమ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.విద్యార్థులకు ఇప్పటికే ఇబ్బందిగా మారిందని కలశాల పరిసరాలను చూసి కళాశాలలకు అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి అని తెలిపారు పాత భవనానికి కొత్త రంగులు అద్ది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న కళాశాలలకు, పాఠశాలలకు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, గత రెండు రోజులుగా కళాశాల బోర్వాటర్లో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రిన్సిపాల్ వివరించారు. ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని డా. సామల హేమ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వై.ఇంద్రాదేవి, అధ్యాపకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.