ఇల్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కొడుకు ఆవేదన

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా..

పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నం కలకలం

(సాక్షి డిజిటల్ న్యూస్) సెప్టెంబర్ 9 కల్లూరు మండల ప్రతినిధి :-తన తండ్రికి చెందిన ఇంటిని తన అక్కకు అక్రమంగా గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపిస్తూ ఓ కుమారుడు కుటుంబ సభ్యులతో కలిసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తల్లాడ మండలం కలకోడిమ గ్రామానికి చెందిన ఆదూరి యేసు దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలు మృతిచెందగా, ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఆదూరి వెంకటేశ్వర్లు, కోడలు విజయ కొంతకాలంగా గ్రామంలో ఉండకుండా వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. దీంతో వృద్ధుడైన యేసు కొంతకాలంగా తన కుమార్తె బొల్లిపోగు నాగమ్మ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి యేసు ఈ ఏడాది మే 22న తన ఇంటిని కుమార్తె నాగమ్మకు గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేశారని వెంకటేశ్వర్లు ఆరోపించారు. అయితే రిజిస్ట్రేషన్‌ జరిగిన రోజే యేసు మృతిచెందారని తెలిపారు. తన అక్క ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న వెంకటేశ్వర్లు.. కుటుంబ సభ్యులు, గ్రామపెద్దలు, గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేసి తనకు తండ్రి ఇల్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అయితే తనకు ఇల్లు ఇవ్వబోమని, ఎక్కడైనా దిక్కున్న చోట చెప్పుకోండని అన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పెద్దల సూచనలను కూడా పట్టించుకోకుండా తమపై ఇష్టారాజ్యంగా మాట్లాడారని ఆరోపించారు. దీంతో న్యాయం కోసం మంగళవారం ఉదయం కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న వెంకటేశ్వర్లు.. ‘‘నా తండ్రికి నేనే కుమారుడిని. నా తండ్రి ఇంటిని నా అక్కకు ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారు?’’ అంటూ అధికారులను ప్రశ్నించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం వద్ద వేచి ఉన్నప్పటికీ సరైన సమాధానం లభించలేదని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.ఈ క్రమంలో తీవ్ర ఆవేదనకు గురైన బాధిత కుటుంబ సభ్యులు తమకు ఆస్తి, తలదాచుకునే చోటు లేకుండా పోయిందని పేర్కొంటూ పెట్రోల్‌తో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకుని శాంతింపజేశారు. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్‌ వ్యవహారాన్ని అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. తమ తండ్రి ఇంటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి ఆస్తిని తమకు అప్పగించాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే కార్యాలయాల్లో ఆందోళనలు చేయడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం సరికాదని పోలీసులు సూచించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాల పరిశీలన అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

🌐 Select Language:
📰 ePaper