
*వేలాది మంది రాకపోకలకు తీవ్ర అంతరాయం.. అత్యవసర సేవలకూ ఆటంకం
సాక్షి డిజిటల్ న్యూస్ ఆగష్టు 7, 2026మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చౌరస్తాలో చిన్నపాటి వర్షం కురిసినా డ్రైనేజీ పొంగిపొర్లి రహదారి మురుగు చెరువును తలపిస్తోంది. అంబేద్కర్ నగర్, ఫేజ్-3, దేవేందర్ నగర్, రాజీవ్ నగర్, గౌతమ్ నగర్, మల్లయ్య నగర్ తదితర కాలనీలకు చెందిన వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు జారి పడుతుండగా, పాదచారులు మురుగు నీటిలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది.వర్షం కురిసిన ప్రతిసారి ట్రాఫిక్ స్తంభించి, అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, ప్రజల నిత్య సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.