
*తక్షణమే పంట నష్టం సర్వే చేపట్టి రైతులకు పరిహారం అందించాలి*
(సాక్షి డిజిటల్ న్యూస్) 5 నవంబర్ 2026 కల్లూరు మండల ప్రతినిధి సురేష్:మురుసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కల్లూరు మండలంలో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం సందర్శించారు. మండలంలోని చండ్రుపట్ల, తదితర గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోత దశకు చేరుకున్న వరి పంటలు భారీ వర్షాలకు నీట మునిగి, నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటికే వివిధ ప్రకృతి పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మురుసు తుఫాను రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరితో పాటు పత్తి పంట కూడా వర్షాల కారణంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు.ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులను క్షేత్రస్థాయికి పంపించి పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతు వివరాలను నమోదు చేసి, సర్వే నివేదికలను ప్రభుత్వానికి పంపించి తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోవడం బాధాకరమని, ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలెపు రామారావు,మాజీ జడ్ పీ టీ సీ సభ్యులు కట్టా అజయ్ కుమార్ , డాక్టర్ లక్కినేని రఘు, నాయకులు పెద్దబోయిన మల్లేశ్వరరావు,పుర కౌన్సిలర్లు పెడకంటి రామకృష్ణ, కనపర్తి శ్యామల రాజ్ కుమార్, ఇంతియాజ్,దారా రమేష్, మేకల కృష్ణ, దేవరపల్లి భాస్కరరావు, మాజీ ప్రజా ప్రతినిధులు,షేక్ కమ్లి, కొరకొప్పు ప్రసాద్, మోర్తాల పిచ్చిరెడ్డి, కళ్యాణ్ కిషోర్, మంచాల కృష్ణ, చింతలపూడి కృష్ణ, వార్డు సభ్యులు కొత్తపల్లి వెంకటి, మాజీ యం పీ టీ సీ సభ్యులు ఖమ్మంపాటి పుల్లారావు, సిహెచ్ కిరణ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.