
సాక్షి డిజిటల్ న్యూస్ : పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అరుదుగా కనిపించే పునుగు పిల్లి ప్రకాశంజిల్లా కొమరోలు మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దర్శనమిచ్చింది. పాఠశాలలోని సిబ్బందికి ఓ గదిలో పునుగు పిల్లి కనిపించడంతో స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పునుగు పిల్లిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పునుగు పిల్లిని చూసిన ఆనవాళ్లు లేవని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో దారితప్పి ఈ ప్రాంతంలోకి వచ్చి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పునుగు పిల్లి అనగానే ముందుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి గుర్తుకు వస్తారు. పునుగుపిల్లి తైలాన్ని వెంకన్నకు స్నానం చేసిన అనంతరం దేహానికి పూస్తారు. విశేష పరిమణం వెదజల్లే పునుగుపిల్లి తైలాన్ని సేకరించాలంటే అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. భారతదేశం, శ్రీలంక, మయాన్మార్, భూటాన్, థాయ్ లాండ్, సింగపూర్, కంబోడియా, మలేషియా, జపాన్ తదితర ఆసియా దేశాల్లో పునుగుపిల్లి ఎక్కువగా కనిపిస్తుంది. ఆసియా దేశంలోని ఈ పునుగుపిల్లి తనదేహం నుంచి వెలువడే తైలం సువాసన వెదజల్లుతుండటంతో విశేషంగా భావిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకన్నకు ప్రతి శుక్రవారం అభిషేకం చేసిన తరువాత పునుగు తైలాన్ని విగ్రహానికి రాస్తారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలోకి వచ్చే పునుగుపిల్లిని పెంచుతూ వాని తైలం తీసేందుకు టీటీడీ అధికారులు గోశాలలో పునుగుపిల్లులను పెంచుతారు. వాటి నుంచి తైలాన్ని సేకరిస్తున్నారు. వన్య ప్రాణి అయిన పునుగు పిల్లిని పెంచుకోవడం చట్ట ప్రకారం నేరం కావడంతో దైవిక కార్యక్రమాల్లో పునుగుపిల్లి తైలం సేకరణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్ర జూ అధారిటీ అనుమతి ఇచ్చింది.