Uncategorized

సూర్యపేట్ కబడ్డీ ఆటగాడు రాజేష్ కు తీవ్ర గాయం

జ్ఞాన తెలంగాణ, (మునగాల) సూర్యాపేట్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, బరకత్‌గూడెం గ్రామానికి చెందిన రాజేష్ చిన్ననాటి నుండే కబడ్డీ పట్ల అపారమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. తల్లి వ్యవసాయ కూలీగా, తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఈ నిరుపేద కుటుంబానికి ఆయన ఒక గర్వకారణం. చిన్నవయస్సులోనే ఆటపై పట్టు సాధించిన రాజేష్, క్రమంగా తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ సూర్యాపేట జిల్లా స్థాయిని దాటి, తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్నాడు. ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయిలో ఆయన రైడింగ్‌కు ఆదరణ పెరిగింది. రాజేష్ రైడ్ కు వెళ్తే పాయింట్ గ్యారంటీ గా సాధిస్తాడని క్రీడాభిమానులు చర్చించు కొనే స్థాయి కి ఎదిగాడు.

వనపర్తిలో జరిగిన ఘటన – మైదానంలో కుదేలైన కలలు

ఇటీవలి వనపర్తి టోర్నమెంట్‌లో పాల్గొన్న రాజేష్, ప్రత్యర్థులపై దాడులు చేసి పాయింట్లు గెలుచుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో, ఓ రైడ్‌లో ప్రమాదవశాత్తూ కుడికాలు తిప్పుకుపోయి మోకాలు బలహీనపడడంతో అక్కడే కుప్ప కూలిపోయాడు. మైదానంలో విలవిలలాడిపోతున్న రాజేష్‌ను చూసి ప్రత్యర్థులు, సహచరులు ఆందోళనకు గురయ్యారు. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి ఆటగాడు కొద్దిలో కోలుకుంటాడు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండడంతో. వెంటనే అతన్ని ఖమ్మం లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో కన్నీటి వాస్తవం – రెండు లక్షల శస్త్రచికిత్స అవసరం – తేల్చి చెప్పిన డాక్టర్లు

ఖమ్మం ఆసుపత్రిలో తీసిన పరీక్షలలో రాజేష్ మోకాలు నరాలు పూర్తిగా విరిగిపోయాయని వైద్యులు నిర్ధారించారు. తక్షణ శస్త్రచికిత్స అవసరమని, దానికి కనీసం రూ.2 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఈ వార్తతో అతని టీం సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రాజేష్‌కు ఇది తీరని శారీరక, ఆర్థిక బాద. సోషల్ మీడియాలో సహచరులు, అభిమానులు మద్దతు తెలియజేస్తూ విరాళాల కోసం ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ అంటే ప్రాణం పెట్టే వేలాది మంది యువత ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక క్రీడాభివృద్ధి నిధులు కేటాయించినా, ఈ తరహా దుస్థితుల్లో తక్షణ చర్యలు లేకపోవడం విచారకరం. రాజేష్‌ వంటి నిరుపేద క్రీడాకారులు ఆటతీరులో గాయపడితే, చికిత్స కోసం విరాళాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ నిరుపేద క్రీడాకారుడి వైద్యానికి సహాయం చేయాలని తెలంగాణ కబడ్డీ క్రీడాకారులు కోరుతున్నారు.

నోట్: సహాయం చేయదలచుకున్న వారు ఈ క్రింది నెంబర్ కు ఫోన్ పే చేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఫోన్ పే: రాజేష్, 77320 45877

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *