సాక్షి డిజిటల్ న్యూస్ : కాకినాడ జిల్లా ఉప్పాడలో బంగారం కోసం వేట కొనసాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం రేణువుల కోసం గాలింపులు చేపట్టారు స్థానికులు. తుఫాన్ల సమయంలో అలలు భారీగా ఎగసి పడి.. ఇసుకతోపాటు బంగారం రేణువులు కొట్టుకొస్తాయని స్థానికుల నమ్మకం. ఉప్పాడ సముద్ర తీరానికి క్యూ కట్టిన స్థానికులు కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో చేపల కోసం వేట కొనసాగించే మత్స్యకారులు.. తుఫాన్ నేపథ్యంలో బంగారం కోసం అన్వేషిస్తుండడం ఆసక్తిగా మారింది. తుఫాన్ ప్రభావంతోనూ చిన్నాపెద్దా తేడా లేకుండా ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం రేణువులు అన్వేషిస్తున్నారు. ఇసుకలోని మిణుకు మిణుకుమని మెరిసే బంగారు రంగు రేణువులను సేకరిస్తున్నారు. కొందరికి బంగారం రేణువులు దొరకడంతో సంబరపడిపోతున్నారు.తుఫాన్ వచ్చిందంటే కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారుల్లో కొత్త ఆశలు చిగురిస్తుంటాయి. తుఫాన్‌లు, భారీ వర్షాలు, ఆటుపోటు సమయంలో సముద్ర తీరంలో పెద్దఎత్తున అలలు వస్తుంటాయి. దీంతో.. ఇసుకతో పాటు.. అనేక రకాల ద్రవ, ఘన పదార్థాలు ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలా వచ్చిన ఇసుకలో అప్పుడప్పుడు బంగారు రేణువులూ దొరుకుతాయనే ప్రచారంతో ఉప్పాడ పరిసర ప్రాంతాల ప్రజలు.. వాటి కోసం వేట కొనసాగిస్తుంటారు.