మానవత్వం మరిచిన దాడి – డెలివరీ బాయ్‌పై క్రూరత!

సాక్షి డిజిటల్ న్యూస్ :బెంగళూరులో హృదయాన్ని కలచివేసే సంఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై జరిగిన ఒక చిన్నపాటి ప్రమాదానికి కోపంతో ఊగిపోయిన దంపతులు.. 24 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను కారుతో ఢీకొట్టి చంపారు. మరింత విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఘటన జరిగిన తర్వాత ఈ దంపతులు మళ్లీ ప్రమాదస్థలికి వచ్చి.. పడిపోయిన తమ కారు భాగాలను తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రోడ్డుపై జరిగిన ఒక చిన్నపాటి ప్రమాదం దారుణమైన హత్యకు దారితీసింది. బెంగళూరులో 24 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి చంపిన ఘటనలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ సహా అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘోరానికి సంబంధించిన హృదయ విదారకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 25న కెంబత్తల్లి నివాసి అయిన దర్శన్ హత్యకు సంబంధించి.. కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ మనోజ్ కుమార్‌తో పాటు అతని భార్య ఆరతి శర్మ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంటను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.రాత్రి 9 గంటల సమయంలో దర్శన్ ప్రయాణిస్తున్న స్కూటర్ ప్రమాదవశాత్తూ కుమార్ కారును ఢీకొట్టింది. దీనివల్ల కారు కుడివైపున ఉన్న సైడ్ మిర్రర్ స్వల్పంగా దెబ్బతింది. దర్శన్ క్షమాపణ చెప్పి.. తాను ఆహారం డెలివరీ చేయడానికి వెళ్లాల్సి ఉన్నందున, వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయాడు. అయితే మనోజ్ కుమార్ కోపంతో ఊగిపోయాడు. వెంటనే యూ-టర్న్ తీసుకొని.. 2కిలోమీటర్ల వరకు స్కూటర్‌ను వెంబడించి, ఉద్దేశపూర్వకంగా వెనుక నుండి ఢీకొట్టాడు. కారు ఢీకొనడంతో దర్శన్న , అతని వెనుక ఉన్న వరుణ్ రోడ్డుపై పడిపోయారు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ దర్శన్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.తొలుత ఇది హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించినప్పుడు అసలు నిజం బయటపడింది. “ఇది ప్రమాదం కాదని.. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా స్కూటర్‌ను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. మరింత విస్తుపోయే విషయం ఏమిటంటే.. అదే కారు రాత్రి 9:40 గంటల ప్రాంతంలో ప్రమాద స్థలానికి తిరిగి వచ్చింది. “ముసుగులు ధరించిన ఆ జంట, సమీపంలో కారును పార్క్ చేసి, ప్రమాద స్థలంలో పడిపోయిన తమ కారు భాగాలను సేకరించారు. వారు వెనక్కి వెళ్తున్నప్పుడు, సీసీటీవీ కెమెరాలు వారి ముఖాలను స్పష్టంగా రికార్డ్ చేశాయి. ఈ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు కారును గుర్తించి, నిందితులను వారి నివాసంలో అరెస్టు చేశారు. నిందితులు సైతం తమ నేరాన్ని అంగీకరించారని తెలిపారు. మృతుడు దర్శన్, తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి జీవిస్తున్నాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అతని కుటుంబం డిమాండ్ చేస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *