సాక్షి డిజిటల్ న్యూస్ :
Shreyas Iyer : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఓ క్యాచ్‌ను అందుకునే క్రమంలో టీమ్ఇండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు బీసీసీఐ అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది. అయినప్పటికి కూడా ఇంకా కొందరిలో ఆందోళన ఉంది. తాజాగా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు.తాను ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నానని, రోజు రోజుకి తన ఆరోగ్యం మెరుగు అవుతుందని తెలిపాడు. ఇక ఈ సమయంలో తనకు అండగా ఉండి, తన కోసం ప్రార్థిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలియజేశాడు.‘ప్రస్తుతం నేను గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో ఉన్నాను. రోజులు గడిచే కొద్ది మరింత మెరుగు అవుతున్నాను. మీ మద్దతును ఎప్పటికి మరిచిపోను. త్వరలోనే తిరిగి వస్తాను. అందరికి కృతజ్ఞతలు.’ అని శ్రేయస్ అయ్యర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దాదాపు మూడు నెలలు ఆటకు దూరం.. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలో అతడి ఎడమవైపు పక్కటెముకలు నేలను బలంగా తాకాయి. తీవ్రమైన నొప్పితో అతడు విలవిలలాడాడు. ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు. రిపోర్టుల్లో అతడి ప్లీహానికి గాయమైందని, అంతర్గత రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా.. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ప్లీహం వద్ద రక్తస్రావం ఆగిపోయేలా చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వెల్లడించాడు. కాగా..ప్లీహానికి సున్నితమైన గాయం కావడంతో అతడు కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందని అంటున్నారు. ఐపీఎల్ 2026 నాటికి అతడి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.