సాక్షి డిజిటల్ న్యూస్ :మొంథా నిలువునా ముంచేసింది... ఎక్కడ చూసినా వర్ష బీభత్సం.. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి.. ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు నేలకొరిగాయి... వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి...ఇళ్లు వరదల్లో చిక్కుకుని జనం భయం గుప్పిట్లో వణికిపోయారు. వాగులు పొంగి రహదారులు చెరువులను తలపించాయి. తీర ప్రాంతాల్లో తుఫాను అలజడి రేపింది. ఏపీలో మొంథా తుఫాన్ పెను విపత్తుగా మారింది. తుఫాన్ ధాటికి రాష్ట్రమంతా చిగురుటాకులా వణికిపోయింది. ప్రకాశం జిల్లాలో 25 ఏళ్ల తర్వాత గుండ్లకమ్మ చెరువు 15 అడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒంగోలు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు వరద నీటిలో మునిగిపోయాయి. కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్ర గట్టును ఆనుకుని ఉన్న సూరాడ పేట, మాయాపట్నం, మత్స్యకార గృహాలు కూలిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కాకినాడ జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. కోత దశలో ఉన్న దాన్యం, మొక్కలు రాలిపోయాయి. విజయనగరంలో నదులు, చెరువులకు వరదనీరు చేరుతుంది. వందల ఎకరాల్లో వరిపంట, చెరుకుపంటలు నీటమునిగాయి. శ్రీశైలం మహా క్షేత్రంలో మొంథా తుఫాను తీవ్ర ప్రభావం పడింది. పాతళగంగ మెట్ల మార్గంపై కొండ చరియలు విరిగి పడ్డాయి. లింగాల గట్టు దగ్గర పెద్ద బండరాళ్లు విరిగిపడ్డాయి. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.