Header Banner

బాహుబలి మరోసారి తెరపై! – గౌతమ్ ఇచ్చిన రివ్యూ అభిమానులను ఉత్సాహపరిచింది

సాక్షి డిజిటల్ న్యూస్ :

Baahubali: The Epic: పాన్ ఇండియా సినిమాకు పునాది వేసి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన చిత్రం 'బాహుబలి'. ఈ ఎపిక్ మూవీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా, 'బాహుబలి: ది ఎపిక్‌' (Baahubali: The Epic) పేరుతో అక్టోబర్ 31న రీ-రిలీజ్ కానుంది. విదేశాల్లో ఒకరోజు ముందే సందడి మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని మహేశ్‌ బాబు కుమారుడు గౌతమ్‌ ఘట్టమనేని (Gautham Ghattamaneni) ఓవర్సీస్‌లో వీక్షించారు. ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్‌లో ఈ సినిమాను చూసిన గౌతమ్, తన అనుభూతిని పంచుకున్నారు. గౌతమ్‌ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. "ప్రపంచంలోనే అతి పెద్ద థియేటర్‌లో 'బాహుబలి: ది ఎపిక్‌' ని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలుసుకోవడానికి రెండేళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎడిట్ చేసిన తర్వాత ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా ఇంత ఆదరణ దక్కడం చాలా ఆనందంగా ఉంది," అని తెలిపారు. "నేను ఈ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఈ రెండు భాగాలను ఒకేసారి చూడడం కొత్తగా ఉంది. నిజంగానే ఇది ఎపిక్‌ సినిమా. ప్రతి సెకనుకు గూస్‌బంప్స్‌ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. అంత అద్భుతంగా ఉంది. క్రేజీ ఫీలింగ్!" అని తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఇక, మహేశ్ బాబు హీరోగా రాజమౌళి (S.S Rajamouli) దర్శకత్వంలో రాబోయే SSMB 29 సినిమా గురించి తనను అడగవద్దని గౌతమ్ సరదాగా కోరారు. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు తనకేం తెలియదని చెప్పి నవ్వులు పూయించారు.