Header Banner

మొంథా తుఫాన్ ఆగ్రహం – ఇళ్లను మింగేసిన సముద్రం

సాక్షి డిజిటల్ న్యూస్ :2 రోజుల చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేశారు. కాకినాడ పోర్టులో పదో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. రోడ్లపై కొబ్బరి చెట్లు నెలకూలాయి. ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దోర్నాల మండలం కొత్తూరు దగ్గర దొంగల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్నూలు – గుంటూరు రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో పలు చోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. జోరువానతో అనేక చోట్ల చెట్లు, కరెంట్‌ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. విరిగిపడిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాయి సహాయక బృందాలు. విజయవాడలో తుఫాన్ ఎఫెక్ట్‌తో వర్షం కురుస్తోంది. వర్షానికి తోడు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దీంతో మున్సిపల్ అధికారులతో కలిసి.. ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చెట్లను తొలగిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.