గ్యాస్ సబ్సిడీ మిస్ కాకూడదంటే ఇప్పుడే ఈ చర్య తప్పనిసరి!”

సాక్షి డిజిటల్ న్యూస్ : గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ముఖ్యమైన విషయం చెప్పాయి. సబ్సిడీ కొనసాగాలంటే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం E-KYC చేయిస్తేనే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మీకు వస్తుంది. మీరు E-KYC పూర్తి చేయకపోతే.. సబ్సిడీ ఆగిపోతుంది. దీనికి చివరి తేదీ, ఎలా చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. సబ్సిడీని కొనసాగించుకోవాలంటే ప్రతి ఏటా ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశాయి. సబ్సిడీ కోసం ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని వినియోగదారులను కోరుతున్నాయి.గ్యాస్ వినియోగదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవడం తప్పనిసరి. కేంద్రం ఏడాదికి గరిష్టంగా 9 సిలిండర్లకు సబ్సిడీ ఇస్తోంది. అయితే కస్టమర్లు బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయనంత వరకు, 8వ, 9వ రీఫిల్‌లకు సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం నిలిపివేస్తుంది. మార్చి 31వ తేదీలోపు E-KYC ప్రక్రియను పూర్తి చేస్తే.. నిలిపివేసిన సబ్సిడీ డబ్బును తిరిగి వినియోగదారులకు చెల్లిస్తారు. లేదంటే ఆ రాయితీ శాశ్వతంగా రద్దవుతుంది. బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయకపోయినా గ్యాస్ సరఫరా మాత్రం నిలిచిపోదు. కానీ సబ్సిడీ రాదు.

E-KYC పూర్తిచేసే విధానాలు: ఈ సేవలు వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకుని E-KYC పూర్తి చేయవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా: ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ లేదా భారత్ పెట్రోలియం వంటి సంబంధిత ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ ద్వారా: మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కు నేరుగా వెళ్లి.. గ్యాస్ సిలిండర్‌ను డెలివరీ చేసే బాయ్ వద్ద ఉండే యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *