సాక్షి డిజిటల్ న్యూస్ : చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్యకేసులో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషుల ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. సుమారు పదేళ్ల క్రితం 2015 నవంబరు 17న అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఐదుగురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. నేడు వారికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ A-1గా, గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ A-2గా, జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జయారెడ్డి A-3గా, మంజునాథ్ అలియాస్ మంజు A-4, మునిరత్నం వెంకటేష్ A-5లు దోషులుగా తేలారు. వారందరికీ ఉరిశిక్ష విధిస్తూ.. న్యాయస్థానం తీర్పువెల్లడించింది. మేయర్ దంపతులను చంపే క్రమంలో అక్కడే ఉన్న వేలూరి సతీష్ కుమార్ నాయుడినీ చంపేందుకు A-4 గా ఉన్న మంజునాథ్ యత్నించడంతో అప్పట్లో హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసులోనూ నేరం రుజువైంది. హంతకులకు ఆయుధాలు సమకూర్చడం, ఆశ్రయం ఇవ్వడం, ధనసాయం చేశారని మిగిలిన 16 మందిపై పోలీసులు అభియోగం మోపగా విచారణలో రుజువు కాలేదు. దీంతో వారిని నిర్దోషులుగా పేర్కొన్నారు. పదేళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో 352 వాయిదాలు కొనసాగాయి. 122 మంది సాక్షులను విచారించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కఠారి మోహన్‌కు చింటూ మేనల్లుడు. వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మేయర్‌గా ఉన్న అనురాధ, మేనమామ మోహన్‌ను అడ్డు తొలగించుకోవాలని చింటూ నిర్ణయించుకున్నాడు. 2015 నవంబరు 17న చింటూ, మరో నలుగురు బుర్ఖాలు ధరించి తుపాకులు, కత్తులతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించారు. కఠారి అనురాధపై చింటూ, మరికొందరు తుపాకులతో కాల్పులు జరపగా ఆమె అక్కడే మృతి చెందారు. పక్క గదిలో ఉన్న కఠారి మోహన్‌ను కత్తులతో నరికారు. కొన ఊపిరితో ఉన్న మోహన్ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చేర్పించగా...చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు.