సాక్షి డిజిటల్ న్యూస్ :తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్దప్రాతిదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్నవారిని వెంటనే సురక్షితప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తుఫాన్ ప్రభావి ప్రాంతాల్లో ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు, సీఎంకి వివరించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాతో పాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలించనున్నారు సీఎం.