Header Banner

అమెరికా వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రీన్యువల్ రద్దు – వేలాది భారతీయుల సమస్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ :అమెరికాలో వలసదారులపై కఠిన నిర్ణయాలతో మరోసారి వార్తల్లోకి వచ్చింది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా US Work Permits (Employment Authorization Documents) ఆటోమేటిక్ రీన్యువల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీని వల్ల వేలాది భారతీయ ఉద్యోగులు (Indians in US) ప్రమాదంలో పడ్డారు. ఇకపై వలసదారులు తమ పని అనుమతుల గడువు పొడిగించుకోవాలంటే స్వయంగా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రకటన ప్రకారం — “అక్టోబర్ 30 తర్వాత వర్క్ పర్మిట్ రీన్యువల్ కోసం దరఖాస్తు చేసే వలసదారులకు ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ ఇవ్వబడదు. అయితే ఆ తేదీకి ముందు పొడిగింపు పొందినవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు” అని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికా ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లు తెలిపింది. ట్రంప్ కొత్త రూల్స్ ప్రభావం గతంలో బైడెన్ ప్రభుత్వం వలసదారులకు పెద్ద సౌలభ్యం కల్పించింది. వర్క్ పర్మిట్ గడువు ముగిసినా 540 రోజుల వరకు పని చేసుకునే అవకాశం ఇచ్చింది. అయితే ట్రంప్ సర్కార్ ఆ విధానాన్ని రద్దు చేస్తూ “కఠినమైన నిబంధనలతో” కొత్త రూల్స్ అమలు చేస్తోంది. USCIS సూచన ప్రకారం — వర్క్ పర్మిట్ గడువు ముగియడానికి 180 రోజుల ముందే రీన్యువల్ దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం చేస్తే తాత్కాలికంగా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. “అమెరికాలో ఉద్యోగం అనేది హక్కు కాదు, అవకాశం మాత్రమే” అని USCIS డైరెక్టర్ జోసెఫ్ తెలిపారు.

EAD (Employment Authorization Document) అనేది ఒక వ్యక్తికి అమెరికాలో నిర్దిష్ట కాలానికి ఉద్యోగం చేసే హక్కు ఉందని నిరూపించే అధికార పత్రం. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన వారు వారి జీవిత భాగస్వాములు, పిల్లలు F-1, M-1 విద్యార్థులు, Dependent Visa holders నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్‌లో (H-4, L-2 మొదలైన వారు) ఉన్నవారు గ్రీన్‌కార్డ్ కలిగినవారికి లేదా H-1B, L-1B, O, P వంటి వీసాలపై ఉన్నవారికి ఈ పత్రం అవసరం లేదు. ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తే, అమెరికాలో ఉన్న వేలాది మంది ఇండియన్ IT ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, మరియు డిపెండెంట్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.