సాక్షి డిజిటల్ న్యూస్ :తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. భక్తులకు చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో భయంతో భక్తులు కేకలు వేశారు. ఈ నేపథ్యంలో తిరుమల నడకమార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ, అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలని సూచించారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది. శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో చిరుత పులి కనిపించింది.150 వ మెట్టు వద్ద చిరుతపులి రోడ్డు దాటుతుండగా అది చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. దీంతో సులభ్ కార్మికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు 150వ మెట్టు వద్దకు చేరుకున్నారు. చిరుతను చూసిన వారి నుంచి వివరాలు సేకరించారు. అలాగే చిరుత అడుగులను గుర్తించి చిరుత సంచారం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
గుంపులుగుంపులుగా పంపిస్తున్న టీటీడీ : చిరుత సంచారం నేపథ్యంలో అటు అటవీ శాఖ ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తం అయ్యింది.భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. భక్తుల భద్రత దృష్ట్యా 800వ మెట్టు వద్ద, శ్రీవారి మెట్టు ప్రారంభ ప్రాంతంలో భక్తులను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు భక్తులను ఒంటరిగా పింపించకుండా 100 నుంచి 150 మందిని గుంపులు గుంపులుగా మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులు చిరుతను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అటవీ శాఖ, టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని...సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ మెట్టు మార్గం ద్వారా తిరుమల చేరుకోవాలని కోరారు. చిన్నపిల్లలను చేతపట్టుకుని వెళ్లాలని భక్తులకు సూచించారు. గతంలో చిన్నారిని ఎత్తుకెళ్లిన నేపథ్యంలో భక్తులు తమ పిల్లలపట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.