“నీ అంతు చూస్తా.. చంపేస్తా” — భయం, ఆందోళనలో ఎంపీ కుటుంబం;పోలీసులు దర్యాప్తు ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్ : బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. నిందితుడు ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడిన వారికోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. రవి కిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు.. అతన్ని కాల్చేస్తాం. అతని కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బీహార్ కు వచ్చేటప్పువడు చంపేస్తాం అని ఫోన్లో గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ద్వివేదీ గోరఖ్ పూర్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎంపీ రవి కిషన్ కు భద్రతను పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం వెతుకులాట మొదలు పెట్టారు. ఇదిలాఉంటే.. రవి కిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. మరోవైపు.. ఈ బెదిరింపు కాల్ పై రవి కిషన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఓ గుర్తుతెలియని వ్యక్తి నన్ను ఫోన్‌లో దుర్భాషలాడాడు. నా తల్లి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. నన్ను చంపేస్తామని బెదిరించాడు. శ్రీరాముడిపై అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడు. ఇది నా వ్యక్తిగత గౌరవంపై ప్రత్యక్ష దాడి మాత్రమే కాదు, మన విశ్వాసం, భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన అంశాలపై కూడా. ఇటువంటి చర్యలు సమాజంలో ద్వేషాన్ని, అరాచకత్వాన్ని వ్యాప్తి చేయడానికి చేసే ప్రయత్నాలు. నేను ఈ బెదిరింపులకు భయపడనని, వాటికి తలవంచనని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రజా సేవ, జాతీయవాదం, ధర్మ మార్గంలో నడవడం నాకు రాజకీయ వ్యూహం కాదు.. ఇది జీవిత సంకల్పం. నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా, ప్రతి పరిస్థితిలోనూ ఈ మార్గంలో స్థిరంగా ఉంటాను. ఈ మార్గం కష్టతరమైనది, కానీ దీనిలోనే నేను నా జీవితాన్ని అర్థవంతంగా చూస్తాను. నేను చివరి వరకు దృఢంగా, అంకితభావంతో ఉంటాను’ అంటూ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *