బస్సు ప్రమాదం భయంకరం – మంటల తర్వాత బంగారం వెతుకులాట కలకలం

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రమాదం జరిగిన రోజునే అక్కడ చెల్లాచెదురుగా పడిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బస్సు ప్రమాద స్థలంలో.. బంగారం కోసం స్థానికులు గాలిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. సుదూర ప్రాంతం నుంచి వచ్చి మరీ.. బంగారం కోసం ఘటనా స్థలంలో కొందరు వ్యక్తులు జల్లెడ పడుతున్నారు. ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. అయితే ప్రయాణికులు ధరించిన బంగారం.. వెండి ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయని గ్రహించారు. దురాశతో మహబూబ్‌నగర్‌ నుంచి కొన్ని కుటుంబాలు బుధవారం ప్రమాద స్థలానికి వచ్చాయి. బస్సు కాలిపోయిన బూడిదను సంచుల్లో సేకరించి.. ప్రమాద స్థలానికి దగ్గరలోని ఓ కుంట వద్ద నీటిలో కడిగి.. బంగారం ఉందో లేదో అని పరీక్షించాయి. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఎన్నిటికీ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కానీ వీళ్లు బంగారంపై ఆశతో.. ఇలా దూరప్రాంతం నుంచి వచ్చి మరీ వెతుకుతుండటం తీవ్ర ఆలోచనలు రేకెత్తిస్తోంది. ప్రమాదానికి గురైన బైక్‌ అప్పటికే రోడ్డుపై పడి ఉండగా ఆఖరు నిమిషంలో గమనించిన బస్సు డ్రైవర్‌ బస్సును బైక్‌ పై నుంచి పోనిచ్చాడు. బస్సు బైక్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్ పగిలి రాపిడి కారణంగా నిప్పు రాజుకుని బస్సులో మంటలు అంటుకున్నాయి. దీపావళి పండగ ముగిసిన వేళ.. మరికొన్ని గంటల్లోనే తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకున్నవారు.. మార్గమధ్యంలో మంటల్లో చిక్కుకుని సజీవ దనహం అయ్యారు. వీరందరి ప్రయాణ లక్ష్యాలు వేరైనా.. తుది గమ్యం మాత్రం మృత్యువు ఒడిలోనే అని ఎవరూ ఊహించలేకపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *