Header Banner

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచరమ్మపై కఠిన చర్యలు! సస్పెన్షన్‌ ఆదేశాలు జారీ

సాక్షి డిజిటల్ న్యూస్ :పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లేడీ టీచర్‌ వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నెర్ర చేసిన రాష్ట్ర ప్రభుత్వం సదరు టీచర్మపై సస్పెన్షన్‌ వేటు వేసింది..నిందితురాలిని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న సుజాతగా తేల్చారు. కుర్చీలో కూర్చుని ఇద్దరు విద్యార్ధినులతో ఆమె కాళ్లు పట్టించుకున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి.సదరు ఉపాధ్యాయురాలు ఎంతో హుందాగా సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ కుర్చీలో కూర్చిని ఉండగా.. ఆమె ముందు ఇద్దరు విద్యార్థినులు నేలపై మోకాళ్లపై కూర్చుని ఆమె కాళ్లు నొక్కడం కనిపిస్తుంది. జనాలు సదరు ప్రధానోపాధ్యాయురాలి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి.ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్‌ చేస్తూ సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా బందపల్లి గిరిజన పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న సుజాతను సస్పెండ్‌ చేసింది. అలాగే సుజాతపై విచారణ పూర్తయ్యే వరకూ ఆమెపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.