సాక్షి డిజిటల్ న్యూస్ :ఘోర విమాన ప్రమాదం జరిగింది. కార్గో విమానం కుప్పకూలడంతో ముగ్గురు మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన అమెరికాలోని లూయిస్ విల్లేలో చోటు చేసుకుంది.లూయిస్ విల్లే విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.15 గంటల సమయంలో యూపీఎస్ ప్లైట్ నంబర్ 2976 విమానం హోనులులకు బయల్దేరగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ విమానం ప్రమాద ఘటనను అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది.ప్రమాదానికి గురైన యూపీఎస్ కార్గో విమానం మెక్‌డోనెల్ డగ్లస్ ఎండీ-11 రకానికి చెందింది. విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసి కుప్పకూలిపోయింది. మంటలతో పైనుంచి నేలపై కూలిపోయిన వెంటనే విమానం పేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.