Header Banner

క్లోజ్ ఫ్రెండ్ కోహ్లీకి అడిగిన టెక్నిక్ – టీ20లో తోపు, వన్డేలో ఫెయిల్

సాక్షి డిజిటల్ న్యూస్ :వన్డే జట్టులోకి తిరిగి రావాలని పట్టుదలతో ఉన్న సూర్యకుమార్ యాదవ్, తన కలలను సాకారం చేసుకోవడానికి ఏబీ డివిలియర్స్ సహాయాన్ని కోరడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డివిలియర్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.టీ20 ఫార్మాట్‌లో మిస్టర్ 360గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), ప్రస్తుతం తన వన్డే కెరీర్‌పై దృష్టి సారించాడు. టెస్టులు, టీ20లలో అద్భుతంగా రాణించినప్పటికీ, 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడం సూర్యకుమార్‌ను కలవరపెడుతోంది.ఈ నేపథ్యంలో, రెండు వైట్-బాల్ ఫార్మాట్‌లలో అద్భుతమైన సమతుల్యత పాటించిన దిగ్గజ క్రికెటర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) సలహా కోసం సూర్యకుమార్ బహిరంగంగా విజ్ఞప్తి చేయడం గమనార్హం.

వన్డేలలో సూర్యకుమార్ విఫలం.. టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అతను నిలకడైన ప్రదర్శన చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు.ఇప్పటి వరకు సూర్యకుమార్ 37 వన్డేల్లో కేవలం 25.76 సగటుతో 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో తాను వన్డే క్రికెట్‌ను కూడా టీ20 లాగే ఆడాలని అనుకున్నానని, అయితే ఆ ఆలోచన సరైంది కాదని ఇప్పుడు అర్థమైందని సూర్యకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఫార్మాట్‌ల మధ్య సమతుల్యత పాటించడంలో తాను విఫలమైనట్లు అంగీకరించాడు. ఈ పేలవ ఫాంతో వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ తర్వాత సూర్యకుమార్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు.

ఏబీడీకి సూర్యకుమార్ సందేశం.. సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్‌ను తన ఆదర్శంగా భావిస్తాడు. మైదానం చుట్టూ షాట్లు కొట్టే అతని సామర్థ్యాన్ని తరచుగా ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే, తన వన్డే కెరీర్‌కు మళ్ళీ జీవం పోయడానికి డివిలియర్స్ సలహా కావాలని సూర్యకుమార్ అడిగాడు. “త్వరలో నేను అతన్ని (ఏబీ డివిలియర్స్) కలిస్తే, టీ20లు, వన్డేలను అతను ఎలా బ్యాలెన్స్ చేశాడో అడగాలనుకుంటున్నాను. నేను అలా చేయలేకపోయాను. వన్డేలను కూడా టీ20ల్లాగే ఆడాలని అనుకున్నాను. రెండు ఫార్మాట్‌లలో విజయం సాధించడానికి అతను ఏం చేశాడో తెలుసుకోవాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. “ఏబీ, మీరు ఈ మాట వింటున్నట్లయితే, దయచేసి నన్ను త్వరగా సంప్రదించండి. ఎందుకంటే, నా ముందు ఇంకా ముఖ్యమైన మూడు-నాలుగు సంవత్సరాలు ఉన్నాయి. నేను వన్డే క్రికెట్ ఆడాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయండి! నేను టీ20లు, వన్డేలను సమతుల్యం చేసుకోలేకపోయాను” అని సూర్యకుమార్ బహిరంగంగా విజ్ఞప్తి చేశాడు.

ఎందుకు ఏబీ డివిలియర్స్?

ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ వైట్-బాల్ ఆటగాళ్ళలో ఒకరిగా పేరుగాంచాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్, మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడగల సామర్థ్యం అతన్ని “మిస్టర్ 360″గా మార్చాయి. కాగా, ఏబీడీ వన్డేలలో 50కి పైగా సగటు, 100కు పైగా స్ట్రైక్ రేట్‌తో రాణించిన సంగతి తెలిసిందే. వన్డే జట్టులోకి తిరిగి రావాలని పట్టుదలతో ఉన్న సూర్యకుమార్ యాదవ్, తన కలలను సాకారం చేసుకోవడానికి ఏబీ డివిలియర్స్ సహాయాన్ని కోరడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డివిలియర్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.