సాక్షి డిజిటల్ న్యూస్ :అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున వంద వికెట్లు తీసిన ఏకైక బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అన్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ బౌలర్‌ను ఆసీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌మేనేజ్‌మెంట్ పక్కన బెట్టింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అతడికి మూడో టీ20 మ్యాచ్‌లో తుది జట్టులో చోటు ఇచ్చారు. ఇక తనకు వచ్చిన అవకాశాన్ని అతడు చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.అయితే.. ఇటీవల తరచుగా అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన బెట్టడానికి గల కారణాలను టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీమోర్కెల్ (Morne Morkel)వెల్లడించాడు. నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు విలేకరులతో మాట్లాడుతూ అతడు ఈ విషయాన్ని చెప్పాడు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే జట్టు విభిన్న బౌలింగ్ కాంబినేషన్‌లను ప్రయత్నిస్తోందన్నాడు. ఈ విషయాన్ని అర్ష్‌దీప్ సింగ్ అర్థం చేసుకున్నాడని తెలిపాడు.‘టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ సీనియర్ ఆటగాడు. అతడికి ఎంతో అనుభవం ఉంది. మేము విభిన్న కాంబినేషన్లను ప్రయత్నిస్తున్నాము. దీనిని అతడు అర్థం చేసుకున్నాడు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్. జట్టుకు అతడి విలువ ఏంటో తెలుసు. అయినప్పటికి ఈ పర్యటనలో కొన్ని విభిన్న కాంబినేషన్లను ప్రయత్నించాం. అది అతడికి అర్థమైంది.’ అని మోర్నీ మోర్కెల్ చెప్పాడు. తుది జట్టు ఎంపిక అనేది టీమ్‌మేనేజ్‌మెంట్‌కు మాత్రమే కాదని, ఆటగాళ్లకు ఓ సవాల్ లాంటిదేనని అన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముంగిట వివిధ రకాల కాంబినేషన్స్ ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆటగాళ్లు తమకు అవకాశాలు రావడం లేదని నిరుత్సాహపడడం సహజమేనని తెలిపాడు. ‘అయితే.. మేనేజ్‌మెంట్ ఆలోచన ఇంకోలా ఉంటుంది. ప్లేయర్లను ప్రోత్సహించాలని, వాళ్లు మరింత మెరుగు అయ్యేలా చేయాలని, ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కూడా వాళ్లు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సన్నద్ధం చేయాలని అనుకుంటాం. ‘అని మోర్నీ తెలిపాడు.ఇక టీ20 ప్రపంచకప్ 2026కు మరెంతో సమయం లేదన్నాడు. ఈలోగా టీమ్ఇండియా చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడనుందని, ఈ నేపథ్యంలో ఒత్తిడి సమయాల్లో ఆటగాళ్లు ఎలా రాణిస్తారో పరీక్షించామని తెలిపాడు.