Header Banner

కష్టపడి సిద్ధమయిన అభ్యర్థులకు నిరాశ.. బీహెచ్‌ఈఎల్‌ పరీక్ష రద్దు!

సాక్షి డిజిటల్ న్యూస్ :భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ యాజమాన్యం గ్రేడ్‌ 4 ఆర్టిజన్ల నియామకాలకు సంబంధించి అక్టోబర్ 8వ తేదీన ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష నిర్వహణ సమయంలో లాంగ్వేజ్ మ్యాపింగ్‌లో సాంకేతిక లోపాల కారణంగా అవకతవకలు జరిగినట్లు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు బీహెచ్‌ఈఎల్ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటనను పొందుపర్చింది. త్వరలో తిరిగి ఈ పరీక్ష నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన కొత్త తేదీలను కూడా ప్రకటిస్తామని అందులో స్పష్టం చేసింది.కాగా బీహెచ్‌ఈఎల్‌ దేశవ్యాప్తంగా ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లలో 515 మంది ఆర్టిజన్ల నియామకానికి కొన్ని నెలల కిందట నోటిఫికేషన్‌ విడుదల చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్ వంటి తదితర ఇతర ట్రేడ్‌లలో 515 ఆర్టిసాన్ ఖాళీల నియామకాలకు గత నెల 8న జరిగిన పరీక్ష నిర్వహించారు. సాంకేతిక భాష-మ్యాపింగ్ లోపం వల్ల తమిళాన్ని ప్రాధాన్యత భాషగా ఎంచుకున్న అభ్యర్ధులకు.. ప్రశ్నలు కన్నడలో కనిపించాయి. ఈ సమస్య హైదరాబాద్‌ సహా అనేక కేంద్రాల్లో తలెత్తింది. తక్షణ పరిష్కార చర్యలకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ మేరకు అక్రమాలు చోటుచేసుకున్నట్లు హైదరాబాద్‌ పరిధిలో పరీక్ష రాసిన అభ్యర్థులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వరుస కథనాలు మీడియాలో రావడంతో బీహెచ్‌ఈఎల్‌ కార్పొరేట్‌ యాజమాన్యం ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల నుంచీ అభ్యంతరాలు స్వీకరించింది. ఆయా అంశాలను క్రోడీకరించి పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షా ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్లనే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఆర్టిసన్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. పరీక్ష రద్దు చేయడం ద్వారా సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్షను నవంబర్‌ చివరి వారంలో లేదా డిసెంబర్‌ తొలి వారంలో తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.