సాక్షి డిజిటల్ న్యూస్ :భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత మహిళా జట్టు తొలి సారి వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు ఏపీ ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదండోయ్.. గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నారు.సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శ్రీచరణి కలిసింది. వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. వన్డే ప్రపంచకప్ గెలిచినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు శ్రీచరణిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలుచుకున్న మధుర క్షణాలను వారితో శ్రీచరణి పంచుకుంది. మహిళా క్రీడాకారులకు జట్టు ఆదర్శంగా నిలిచిందని సీఎం ప్రశంసించారు.
ఘన స్వాగతం.. అంతకముందు శ్రీచరణికి గన్నవరం విమానాశ్రమంలో ఘన స్వాగతం లభించింది. మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.