సాక్షి డిజిటల్ న్యూస్ :కార్పొరేట్ చరిత్రలోనే ఎలన్ మస్క్ సంచలనం సృష్టించాడు. అత్యధిక జీతం అందుకుంటున్న సీఈవోగా రికార్డు క్రియేట్ చేశారు. జీతం కింద మస్క్‌కు ట్రిలియన్ డాలర్లు ఇచ్చేందుకు టెస్లా కంపెనీ షేర్‌హోల్డర్లు ఆమోదించారు. దీంతో పే ప్యాకేజీలో కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. కంపెనీకి చెందిన షేర్‌హోల్డర్లలో 75% ఓట్లు అనుకూలంగా వచ్చాయి. వార్షిక కంపెనీ సమావేశంలో మస్క్ జీతంపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రపంచ కుబేరుడు మస్క్ ఇప్పుడు తన సంపదను మరింత పెంచుకోనున్నారు. రాబోయే పదేళ్లలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా మార్కెట్ వాల్యూ మరింత పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ షేర్‌హోల్డర్లు అనుకున్నట్లు మస్క్ తన లక్ష్యాలను సాధిస్తే, అప్పుడు ఆయనకు లక్షల సంఖ్యలో షేర్లు కలిసి రానున్నాయి. భారీగా జీతాన్ని ఇవ్వడం పట్ల విమర్శలు కూడా వచ్చాయి. కానీ, టెస్లా బోర్డు సీఈవో మస్క్‌కు అండగా నిలిచింది. ఒకవేళ ఆయన జీతాన్ని ఆమోదించకుంటే ఆయన కంపెనీ వదిలి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు బోర్డు భయాందోళనకు గురైంది. ప్రస్తుతం ఉన్న దశలో మస్క్‌ను వదులుకోలేమని టెస్లా బోర్డు చెప్పింది. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉన్న మస్క్ తన జీతం విషయం తెలియగానే సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. టెస్లాలో ఇది కొత్త అధ్యాయం మాత్రమే కాదని, ఇదో కొత్త చరిత్ర అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. మస్క్‌కు ట్రిలియన్ డాలర్ల పే ప్యాకేజీ అందాలంటే ఆయన ముందుకొన్ని టార్గెట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ 1.4 ట్రిలియన్ల డాలర్లుగా ఉన్నది. ఆ మార్కెట్ విలువను 8.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాల్సి ఉంటుంది. స్వీయ డ్రైవింగ్ చేస్తున్న లక్షల సంఖ్యలో రోబోట్యాక్సీ వాహనాలను కమర్షియల్ ఆపరేషన్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నీ అనుకుట్లే సాగితే, ప్రపంచ కుబేరుడు మస్క్ ప్రపంచంలోనే తొట్టతొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశాలున్నాయి.