ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల తొలగింపులు పెరుగుతున్నాయి, లక్ష దాటిన సంఖ్య

సాక్షి డిజిటల్ న్యూస్ :ఇక.. అమెజాన్, ఇంటెల్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ వేలాది ఉద్యోగాలకు మంగళం పాడుతున్నాయి. అమెజాన్ తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఆపరేషన్స్, హెచ్‌ఆర్, విభాగాల్లోని 14,000 కార్పొరేట్ ఉద్యోగాలు సహా మొత్తం 30,000 మందిని తొలగిస్తోంది. కంపెనీని ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌లా’ నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నామని సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. చిప్‌మేకర్ ఇంటెల్ కూడా 24,000 ఉద్యోగాలను అంటే మొత్తం సిబ్బందిలో 22 శాతం తగ్గించనుంది. పీసీలకు డిమాండ్ తగ్గడంతో ఎన్విడియా, ఏఎండీ వంటి పోటీదారులతో ఇంటెల్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సైతం తన చరిత్రలోనే అత్యంత భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. సెప్టెంబర్ 2025తో ముగిసిన త్రైమాసికంలో 19,755 మందిని తొలగించింది. దీంతో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2022 తర్వాత మొదటిసారిగా 6 లక్షల దిగువకు చేరింది. ఏఐ ఆధారిత ఆటోమేషన్‌పై దృష్టి సారించడమే కారణం. యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్ కూడా వేలాది మందిని తొలగించాయి. ఏఐ, క్లౌడ్ సేవలపై పెట్టుబడులను పెంచేందుకు మైక్రోసాఫ్ట్ 9,000 మందిని, కస్టమర్ సేవలను ఏఐ ఆటోమేట్ చేస్తుండటంతో సేల్స్‌ఫోర్స్ 4,000 మందిని తొలగించాయి. సిస్కో, గూగుల్, మెటా, ఒరాకిల్ కూడా ఏఐని కేంద్రంగా చేసుకుని పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తగ్గించాయి. ఈ లేఆఫ్స్ ట్రెండ్ కేవలం టెక్ కంపెనీలకే పరిమితం కాలేదు. ఒకవైపు కంపెనీలు ఏఐ టూల్స్‌పై బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడి పెడుతుండగా, మరోవైపు సంప్రదాయ ఉద్యోగాలను తగ్గించుకోవాల్సి వస్తుండటం టెక్ రంగంలో కొత్త సవాలుగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *