Header Banner

కొత్త జిల్లాల సస్పెన్స్‌కు తెరపడుతుందా? ఇవాళ కేబినెట్‌ మీటింగ్‌ నిర్ణయాత్మకం!

సాక్షి డిజిటల్ న్యూస్ :మరికొన్ని గంటల్లో ఏపీ కేబినెట్‌ భేటీ జరగనుంది. భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలున్నాయ్. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుతో పాటు జిల్లాల పునర్వవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్.సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో కేబినెట్‌ భేటీ జరగనుంది. విశాఖ వేదికగా నవంబర్ 14,15న జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుపై కేబినెట్‌ ప్రధానంగా చర్చించనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల ప్రతినిధులు హాజరుకానుండటంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదస్సు ఏర్పాట్లను ఇప్పటికే మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్‌లో ఏర్పాట్లపై మంత్రులను వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు పలు కీలక సూచనలు చేయనున్నారు.అలాగే రాష్ట్రానికి సుమారు లక్ష కోట్లు విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొంథా తుఫాన్ ప్రభావం.. దాని వల్ల జరిగిన నష్టం అంచనాలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు CRDA పనులు కోసం NaBFID నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అవసరమైన అనుమతిని కూడా కేబినెట్ ఇవ్వనుంది. ఈ కేబినెట్‌ భేటీలో అత్యంత కీలకంగా పరిగణించదగిన అంశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తుది నిర్ణయం ఒకటి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు జిల్లాల విభజన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగి ఒక నిర్ణయం తీసుకుంది కూడా. ఆ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.