ఇక ఊపిరి కూడా ముప్పులో! దేశం మొత్తాన్ని కమ్మేస్తున్న గాలి కాలుష్యం

సాక్షి డిజిటల్ న్యూస్ :ఇది ఊపిరి పీల్చుకునే వార్త కాదు. ఊపిరి పీల్చాలంటేనే భయపడే న్యూస్‌. దేశంలోని కొన్ని నగరాల్లో స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకుని ఎంత కాలమైందో అని నిట్టూర్చే జనం ఉన్నారు. అలాంటి వాటిల్లో ఇప్పటిదాకా ఢిల్లీ నెంబర్‌ వన్‌ అనుకున్నాం. కానీ ఎయిర్‌ పొల్యూషన్‌లో ఢిల్లీని కూడా తలదన్నుతున్నాయి కొన్ని ప్రాంతాలు.దేశంలో వాయు నాణ్యత క్షీణిస్తోంది. గాలిలో ఆక్సిజన్‌ కంటే పొల్యూషన్‌ ఎక్కువగా ఉంటోంది. అచ్చమైన స్వచ్ఛమైన ఆక్సిజన్‌ని ఊపిరితిత్తుల నిండా పీల్చుకోవాలని ఆశపడే ఢిల్లీవాసులు కూడా ఆశ్చర్యపడే వార్త ఇది. దేశంలో వాయు నాణ్యత అత్యంత అధ్వానంగా ఉండే నగరాల్లో ఢిల్లీ…ఇప్పుడు ఫస్ట్‌ ప్లేస్‌లో లేదు. దేశంలోని టాప్‌ వాయు కాలుష్య ప్రాంతాల్లో హర్యానాలోని ధారుహెరా మొదటి స్థానంలో నిలిచింది. హర్యానాకే చెందిన రోహతక్‌కు రెండో స్థానం దక్కింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌, నోయిడాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇక హర్యానాకే చెందిన బల్లబ్‌గఢ్‌, ఐదో స్థానంలో ఉంది. ఇప్పటిదాకా ఎయిర్‌ పొల్యూషన్‌కు సంబంధించి వార్తల్లో ఫస్ట్‌ వినిపించే ఢిల్లీ పేరు మాత్రం ఆరోస్థానంలో ఉంది. ఇక మహారాష్ట్రలోని భివాండి 7వ స్థానంలో నిలవగా, యూపీకి చెందిన గ్రేటర్‌ నోయిడా, హాపూర్‌లు ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి. హర్యానాలోని గురుగ్రామ్‌ పదో స్థానంలో ఉంది.

ఒకరోజులో 15ఎంజీలకు మించరాదు.. ఢిల్లీ ఆరో ప్లేసులో నిలబడినందుకు సంతోషించాలో, దాన్ని మించి మిగిలిన ప్రాంతాలు వాయు కాలుష్యంలో ముందుకు దూసుకునిపోతున్నందుకు వర్రీ అవాల్సిన పరిస్థితి దాపురించినందుకు బాధపడాలో అర్థం కావట్లేదంటున్నారు నిపుణులు. ఇండో-గంగా మైదాన ప్రాంతంలో చాలా తక్కువ స్థాయిలో స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్..CREA పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. క్యూబిక్ మీటర్ గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాలు… PM 2.5 సైజు మించరాదు. అలాగే వాటి ఏడాది సగటు సాంద్రత 5 మైక్రోగ్రామ్‌లు ఉండాలి. ఇక ఒక రోజు వ్యవధిలో ఈ స్థాయి 15ఎం.జీ.లకు మించరాదు. జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం వీటి స్థాయి 40-60 ఎం.జీ.ల మధ్య ఉండాలి. అయితే.. గత నెలలో అనేక ప్రాంతాల్లో పీఎం 2.5 సాంద్రతలు ఎక్కువ మోతాదులో నమోదయ్యాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది చాలా అధికం.

ధారుహెరాలో 125 ఎంజీలు: హర్యానాలోని ధారుహెరాలో పీఎం 2.5 అత్యధిక స్థాయిలో 123 ఎం.జీ.లకు చేరగా.. అదే రాష్ట్రంలోని రోహ్‌తక్‌ ప్రాంతం ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. గాలి నాణ్యత క్షీణించిన తొలి పది ప్రాంతాల్లో ఎనిమిది…హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌లలోనే ఉండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇక ఢిల్లీలో ఈ మధ్య పంట వ్యర్థాల దహనం సమస్యలు లేకపోయినా.. పీఎం 2.5, 107ఎం.జీ.లతో 6వ స్థానంలో ఉంది. స్వచ్ఛమైన వాయునాణ్యతను నమోదు చేసే నగరాల సంఖ్య సెప్టెంబర్‌లో 170 ఉంటే.. అక్టోబర్ నాటికి వాటి సంఖ్య 68కి పడిపోయింది.

లక్షలాదిమందికి ఆరోగ్య సమస్యలు.. శ్వాసకోశ, హార్ట్‌ సంబంధిత వ్యాధులు వాయు నాణ్యత క్షీణించి పీఎం 2.5 స్థాయి పెరగడం వల్ల లక్షలాది మంది శ్వాసకోశ, హృదయ సంబంధిత సమస్యల బారినపడే అవకాశముంది. ప్రస్తుతం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ వంటి స్పల్పకాలిక చర్యలు చేపడుతున్నప్పటికీ వాహనాలు, పారిశ్రామిక కర్మాగారాలు, దుమ్ము-ధూళి, గృహ ఇంధన వినియోగం నుంచి వచ్చే ఉద్గారాలనూ పరిష్కరించాల్సిన అవసరముంది. లేదంటే ఈ స్థాయిల్లో గణనీయ పెరుగుదల నమోదయ్యే అవకాశముంది. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యంపై, ఇండియా గేట్‌ దగ్గర ప్రజలు ఆందోళన బాట పట్టారు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *