సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు. పోటీ ఎక్కువ, రాత పరీక్షలూ, ఇంటర్వ్యూల్లాంటి ఎన్నో దశల్లో గట్టి వడపోత ఉంటుంది. ఇలాంటి కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సంపాదించటమే గగనమైతే.. ఓ కుర్రోడు మాత్రం ఎలాంటి కోచింగ్ లేకుండానే ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు..తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి చెందిన ఓ రైతు కొడుకు అజయ్‌కుమార్. అజయ్ తండ్రి అర్కా సంజీవరావు వ్యవసాయం చేస్తారు. తల్లి జ్యోతి గృహిణి. వీరికి ముగ్గురు కొడుకులు. వీరిలో అజయ్ చిన్న తనం నుంచే చదువులో ముందుండే వాడు. పదో తరగతి వరకూ తెలుగు మీడియం, ఇంటర్ నుంచీ ఇంగ్లిష్ మీడియంలో చదివిన అజయ్.. బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్, ఆ తర్వాత బీబీఐ పూర్తి చేశాడు.అమ్మానాన్నల కష్టం చూస్తూ పెరిగిన అజయ్.. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొదట 2018లో అటవీశాఖ బీట్ అధికారి, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇందులో పంచాయతీ సెక్రటరీగా తొలుత కొలువులో చేరాడు. ఈ ఉద్యోగం చేస్తూనే 2020లో మరో మూడు ప్రభుత్వ కొలువులు సాధించాడు. రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, బెటాలియన్ ఎస్ఐ, సివిల్ కానిస్టేబుల్.. ఈ మూడు పోస్టుల్లో లోకో పైలట్‌గా చేరినా అందులో కొనసాగలేదు. తర్వాత 2023లో సివిల్ ఎస్ఐ, గ్రూప్ 3 ఉద్యోగాలు కొట్టాడు. సివిల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం గ్రూప్ 2 ద్వారా రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికై ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇన్ని ఉద్యోగాలకు ఎంపికైన అజయ్ పరీక్షలకు రెండు మూడు నెలల ముందు నుంచీ సన్నద్ధతకు ఐదారు గంటలు మాత్రమే కేటాయించేవాడట. మధ్యలో గంట విరామం తీసుకునేవాడినని తన ప్రిపరేషన్ విధానాన్ని చెప్పుకొచ్చాడు.
నా ప్రిపరేషన్ ఎలా సాగిందంటే.. ఆన్లైన్లో ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉండే జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అన్నీ చదివేవాడిని. అలాగే సోషల్ మీడియాలో షేర్ అయ్యే క్లిప్పింగ్స్ కూడా. ఒక పరీక్షకు రకరకాల సోర్సులు పెట్టుకోకుండా ఒక్క మెటీరియల్‌నే ఫాలో అయ్యాను. రివిజన్ ఎక్కువగా చేసేవాడిని. సిలబస్ మొత్తం చదివేయాలని ఆరాట పడకూడదు. 60 నుంచి 70 శాతం సిలబస్ చదివినా సరిపోతుంది. అర్థం చేసుకుంటూ చదవడం చాలా ముఖ్యం. కరెంట్ అఫైర్స్‌ను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకుంటూ చదవాలి. ఎన్ని గంటలు చదివామన్నది కాదు.. ఎంత ఏకాగ్రతతో చదివామన్నదే ముఖ్యం.