సాక్షి డిజిటల్ న్యూస్ :మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ మూవీనుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే, మీసాల పిల్ల యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో టాప్ ప్లేస్ కు చేరుకుంది. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందు పంచడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని, అందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో తమన్నా స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆమె నటించిన ‘కావాలయ్య’, ‘డా డా డాస్’ వంటి పాటలు షేక్ చేశాయి. ఇప్పుడు అదే జోరుతో చిరంజీవి సినిమాలో కూడా మాస్ ఆడియన్స్‌కు అదిరిపోయే కిక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పాట కోసం చిత్ర యూనిట్ భారీ సెట్‌ను నిర్మించి, గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోందట. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, కమర్షియల్ హంగుల కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. చిరంజీవి ఎనర్జీకి, తమన్నా గ్లామర్‌కు తోడు సంగీత దర్శకుడు థమన్ అందించే మ్యూజిక్ కూడా తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై చిరంజీవి, తమన్నా డ్యాన్స్ చూడటం అభిమానులకు కనుల పండుగే అవుతుంది