సాక్షి డిజిటల్ న్యూస్ :దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో.. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌కు సంబంధించిన వైట్-కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌లో ఫరీదాబాద్‌కు చెందిన మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్ ప్రధాన పాత్రధారిగా గుర్తించారు. దీంతో అధికారులు ఆమెను ఈ నెల 11న అరెస్ట్ చేశారు. దేశంలో జైషే మహిళా విభాగాన్ని ఏర్పాటుతో పాటు దానికి నాయకత్వం వహించే బాధ్యతను షాహిన్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ కొత్తగా ఏర్పడిన నెట్వర్క్ దేశంలో మహిళలను నియమించడం, వారికి శిక్షణ ఇవ్వడం, రాడికల్ ఆలోచనలను వ్యాప్తి చేయడంపై దృష్టి సారించింది. రహస్య సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా షాహీన్ పాకిస్తాన్‌లోని జైషే నేతలతో టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. జైష్-ఎ-మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేరుగా డాక్టర్ షాహీన్‌కు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో JeM మహిళా విభాగానికి సాదియానే నాయకత్వం వహిస్తోంది. డాక్టర్ షాహీన్ అరెస్ట్.. ఆమె సహచరులైన మరో ఇద్దరు వైద్య నిపుణులు.. డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఉమర్ ఉ నబీలను అరెస్ట్ చేసిన తర్వాత జరిగింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో వీరి పాత్ర బయటపడింది. నవంబర్ 8న డాక్టర్ ముజమ్మిల్‌ను అరెస్ట్ చేసినప్పుడు, అతని వద్ద AK-47 రైఫిల్, పేలుడు పదార్థాలు దొరికాయి. విచారణలో ముజమ్మిల్.. డాక్టర్ షాహీన్ పాత్ర గురించి, JeM మహిళా సభ్యులతో ఆమె సమన్వయం గురించి చెప్పడంతో నవంబర్ 11న ఆమెను అరెస్ట్ చేశారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె తన డాక్టర్ హోదాను ఉపయోగించుకుంది.