Header Banner

బీఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై న్యాయ ప్రక్రియ: కేసు దాఖలు

సాక్షి డిజిటల్ న్యూస్ :బీఆర్ఎస్ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా.. నిబంధనలు ఉల్లంఘించి, పోలింగ్ కేంద్రం వద్ద హల్‌చల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న (మంగళవారం) పోలింగ్ జరిగిన సమయంలో.. యూసఫ్‌గూడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కౌశిక్ రెడ్డి గందరగోళం సృష్టించారని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైందని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న (మంగళవారం) ఎలక్షన్ పోలింగ్ జరుగుతుండగా.. ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి యూసఫ్‌గూడలోని మహ్మద్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. నిబంధనల ప్రకారం.. పోలింగ్ కేంద్ర లోపలికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నప్పటికీ, ఆయన వినిపించుకోకుండా సిబ్బందిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లారని అధికారులు వెల్లడించారు. ఈ  క్రమంలోనే పోలింగ్ కేంద్రం వద్ద కౌశిక్‌రెడ్డి తీరు ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే.. ఆయనపై ట్రెస్పాస్ (అక్రమంగా చొరబడటం), పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేసినట్లు మధురానగర్ పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలీంగ్ నిన్న(మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా ముగిసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, పలు చోట్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు.