పేదల కలను నిజం చేసిన నాయకుడు: ఎన్టీఆర్, చంద్రబాబు గుర్తు చేసుకున్న ఘటనా

సాక్షి డిజిటల్ న్యూస్ :మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు ఇవాళ సీఎం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదని, భవిష్యత్‌కు భద్రత అన్నారు. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని గుర్తుచేశారు. కూడు, గూడు, దుస్తులు.. నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. ఈ సందర్భంగా ఇళ్ల లబ్ధిదారులకు సీఎం అభినందనలు తెలిపారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు అప్పగిస్తున్నామని, మళ్లీ ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి అప్పగిస్తాని వెల్లడించారు. ఇది పేదల ప్రభుత్వమన్నారు. పేదలకు న్యాయం చేసేందుకు పనిచేస్తామన్నారు. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తామని స్పష్టం చేశారు. ఇళ్లపై సౌరఫలకాలు పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. నివాసాలపై, పొలాల్లో కరెంటు తయారు చేయిస్తున్నామని తెలిపారు. సౌర, పవన, జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకుంటే మనకే కష్టమన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వాటా ఇవ్వక చాలా నష్టపోయామని, కూటమి ప్రభుత్వంలో రాయలసీమలో 90% రాయితీకి డ్రిప్‌ పరికరాలు ఇచ్చామని పేర్కొన్నారు. నిన్న ప్రకాశం జిల్లా కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశామన్నారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని పిలుపునిచ్చారు.రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. వర్క్‌ఫ్రం హోమ్‌ కింద ఇక్కడి నుంచే పని చేసుకోవచ్చు అన్నారు. ఎక్కడి వాళ్లకు అక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్‌ పూర్తిచేసే బాధ్యత తనదేనన్నారు. చెరువులన్నీ నింపి భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమన్నారు. నదుల అనుసంధానం తన జీవితాశయమన్నారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడూ నిర్లక్ష్యంగా చేయనని సీఎం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *