సాక్షి డిజిటల్ న్యూస్ :ఇటీవల సిని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే తాజాగా తమిళనాడులో ఇద్దరు రాష్ట్రమంత్రుల ఇళ్లు సహా నటీనటులు అజిత్ కుమార్, రమ్యకృష్ణల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రులు కేఎన్ నెహ్రు, అన్బల్ మహేష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే తాజాగా నటులు అజిత్ కుమార్, రమ్మకృష్ణ, నాయకులు ఎస్‌వీ శేఖర్ ఇళ్లకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు. తమిళనాడు డీజీపీ ఆఫీస్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నుంచి ఈ మెయిల్ వచ్చింది. వెంటనే డాగ్ యూనిట్లు, బాంబు స్క్వాడ్ సిబ్బంది వారి ఇళ్లకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇది కేవలం తప్పుడు హెచ్చరికలు చేశారని, ఆ ప్రాంతాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని నిర్ధారించారు.