Header Banner

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల్లో వాతావరణం: వెదర్ అప్‌డేట్ మీ కోసం!

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణంలో వాతావరణంపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని.. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. శ్రీలంకకు దక్షిణాన నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, ఇప్పుడు దక్షిణ శ్రీలంక – దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉంది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- శుక్రవారం, శనివారం, ఆదివారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- శుక్రవారం, శనివారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది.ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:- శుక్రవారం, శనివారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశముంది. ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నవి. వీటి ప్రభావంతో శుక్రవారం, శనివారం, ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుండి మూడు నుండి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర – పశ్చిమ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది.