సాక్షి డిజిటల్ న్యూస్ :సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదంలో 45 మంది భారతీయ యాత్రికులు సజీవదహనమయ్యారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది.ఈ భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన 45 మంది భారతీయుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నారు.అయితే, మెహిదీపట్నంలోని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు సమాచారం, సహాయం అందించేందుకు హైదరాబాద్‌లోని సచివాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఇందులో 18 మంది మృతి చెందారు. మృతుల్లో రహీమున్సీసా, షెహనాజ్ బేగం, కదీర్ మహ్మద్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, రహమత్ బీ, సోహైల్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, ఫర్హీన్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ అలీ, మహ్మద్ మంజూర్ తో ఇద్దరు ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం భారత ఎంబసీతో మాట్లాడి వివరాలు సేకరించాలని కోరారు. ప్రధాని మోదీ సౌదీ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.