సాక్షి డిజిటల్ న్యూస్ :కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవంతో సన్మానించనుంది. ఈ ఏడాది గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ 2025) వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో రజినీకాంత్, బాలకృష్ణలను సన్మానించనున్నారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి వీరిద్దరూ 50 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంలో వీరిని సత్కరించనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా మంత్రి ప్రమోద్ సావంత్ ఈ విషయాన్ని మీడియాతో వెల్లడించారు. ‘ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇదొక మైలురాయి. రజినీకాంత్, బాలకృష్ణ వారి సినీ ప్రయాణంలో 50 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మానించబోతున్నాం. వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో ప్రేక్షకులను అలరించారు. వారి సినీ ఇండస్ట్రీకి చేసిన కృషికి గుర్తింపుగా వారిని సన్మానించబోతున్నాం’ అని ఎల్.మురుగన్ అన్నారు.ఇది వారి అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయమనే చెప్పాలి.ఇఫీ 2025 అవార్డులు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి. 1974లో విడుదలైన తాతమ్మ కల చిత్రంతో బాలకృష్ణ సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఇప్పుడాయన 110వ సినిమా అఖండ 2ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. 1975లో విడుదలైన అపూర్వ రాగంగల్ చిత్రంతో రజినీకాంత్ నటుడిగా తన సినీ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన తన 172వ చిత్రం జైలర్ 2ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.