Header Banner

చక్కెర పొంగలి చోరీ—ఆలయంపై ప్రశ్నలు!

సాక్షి డిజిటల్ న్యూస్ :దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయ ప్రసాద పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో చక్కెర పొంగలి అక్రమంగా తరలిస్తూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారనే హడావుడి జరిగింది. భద్రాచలం పట్టణానికి చెందిన భక్తులు 5 కిలోల చక్కెర పొంగలి తయారు చేయించి తీసుకెళ్తున్న క్రమంలో భద్రతా సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. తూకం వేయడంతో 32 కిలోల బరువు వచ్చింది. అయితే.. సదరు భక్తులు తాము నిబంధనల ప్రకారం కిలోకి 400రూపాయల చొప్పున 2 వేలు చెల్లించామని చెప్పడంతో వారికి ఇబ్బంది కలుగకుండా అధికారుల ఆదేశాలతో వారిని పంపించారు. కానీ.. ఐదు కిలోలకు 32కిలోల చక్కెర పొంగలి ఎలా వచ్చిందనేది అయోమయానికి గురిచేసింది.అలర్ట్‌ అయిన భద్రాద్రి ఆలయ ఈఓ దామోదరరావు మరోసారి భద్రతా సిబ్బంది సమక్షంలో ఐదు కిలోల చక్కెర పొంగలి తయారు చేసి తూకం వేయగా అది 36 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన పద్ధతి ప్రకారమే జరిగిందనే నిర్ణయానికి వచ్చారు ఆలయ అధికారులు. ఇదిలావుంటే.. ఎక్కడైనా ఆల‌యాల్లో త‌యారైన ప్రసాదం ప్యాకెట్ల లెక్కన భ‌క్తుల‌కు అందిస్తుంటారు. కానీ.. భద్రాద్రి ఆలయంలో మాత్రం భ‌క్తులు ముందుగా ఆర్డర్ ఇస్తే త‌యారీ చేసి స‌ర‌ఫ‌రా చేస్తారు. ఇదే అదనుగా అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.ఇందులో భాగంగానే.. చక్కెర పొంగలి అక్రమాన్ని క‌ప్పిపుచ్చేందుకు ఆల‌య అధికారులు ప్రయత్నిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.