సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి రెండో సమావేశంలో మొత్తం 14 అంశాలపై సుదీర్ఘ చర్చ జరపగా 11 అంశాలకు ఆమోదం తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం రెండు అంశాలు వాయిదా వేయగా, ఒక్క అంశాన్ని తిరస్కరించినట్లు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు.ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూలతో పాటు ఆలయ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. అలాగే స్థానికంగా నివసిస్తున్న చెంచు గిరిజనులకు నెలలో ఒక్కరోజు స్వామివారి స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక శ్రీగిరిలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి దేవాలయాన్ని దత్తత ఆలయంగా స్వీకరించాలని నిర్ణయించారు. ఇకపై శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలోనే దీప దూప నైవేద్యాలు నిర్వహించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. డిసెంబరు 1వ తేదీ నుంచి స్వామి వారి 500 రూపాయల స్పర్శ దర్శన టికెట్‌పై రెండు 100గ్రాముల లడ్డూలు, రూ. 300 సర్వదర్శన టికెట్‌కు ఒక లడ్డూను ఉచితంగా ఇచ్చేందుకు ఆలయ బోర్డు ఆమోదించింది. ఇక శ్రీశైలం క్షేత్రంలో భక్తులకు కలుగుతున్న అసౌకర్యాల గురించి ఫిర్యాదులు, సలహాలను తెలిపే బాక్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో ప్రధాన కూడలిలలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు మరింత సౌకర్యార్థంగా ఉండేందుకు ఆలయ పరిసరాల్లో డిజిటల్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది.వీటితోపాటు సర్వదర్శనం క్యూ లైన్లలో భక్తులు అధిక సమయం దర్శనానికి వేచి ఉండకుండా త్వరగా దర్శనాలు చేసుకునే విధంగా ఆయా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సాధారణ భక్తుల సౌకర్యాల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని బోర్డు నిర్ణయించినట్లు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు.