సాక్షి డిజిటల్ న్యూస్ : ఓ వ్యక్తి తన కారుకు సైడ్ ఇవ్వలేదంటూ.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వల్లంపట్లలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులపై దాడులు, బెదిరింపులు, ఉద్యోగంలో ఆటంకాలు సృష్టించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సహా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన విధుల్లో ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా దాడులు జరిపితే.. వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాంటి వాటిని చిన్న సంఘటనలుగా తీసుకోకూడదని, వారిని నేరపూరిత చర్యలుగా పరిగణించి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.ఇక, ఇలాంటి నేరాలకు పాల్పడితే శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో కూడా సీపీ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం BNS (భారత న్యాయ సంహిత)లోని సెక్షన్ 221, 132, 121(1) కింద తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు. ఇలాంటి కేసులు ఒకసారి నమోదైతే.. పాస్‌పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగాలు, భవిష్యత్ అవకాశాలు వంటివన్నీ ప్రమాదంలో పడతాయని స్పష్టం చేశారు. మీరు క్షణికవేశంలో చేసే ఒక చిన్న తప్పు కూడా జీవితాంతం నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందన్నారు. అందరూ నియంత్రణతో వ్యవహరించాలని కఠిన హెచ్చరిక జారీ చేశారు.