సాక్షి డిజిటల్ న్యూస్ :దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్‌లో ఇవాళ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందన్నారు.అలాగే తెలంగాణలాగే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ కోరారు. అవసరమైతే అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవాలని వినతి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.అయితే ఇప్పటికే తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. పేదలకు పోషకాహారం అందించే లక్ష్యంతో దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేలా రేవంత్
సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.