సాక్షి డిజిటల్ న్యూస్ :చిప్స్ ప్యాకెట్ ఓ చిన్నారి నిండు ప్రాణం తీసింది. పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్లలో వచ్చిన ఓ చిన్న బొమ్మను నాలుగేళ్ల బాలుడు గుటుక్కున మింగేశాడు. అది గొంతులో అడ్డుపడటంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయాడు. గమనించిన తల్లిదండ్రులు పరుగు పరుగున హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా.. దారిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కంధమాల్ జిల్లా ముసుమహాపాడ గ్రామానికి చెందిన రంజిత్ ప్రధాన్‌కి నాలుగేళ్ల కుమారుడు బిగిల్ ఉన్నాడు. సోమవారం పని మీద బయటకు వెళ్లిన రంజిత్ ఇంటికి వెళ్తూ.. పిల్లాడి కోసం ఓ షాపులో చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగా అందులో చిన్న తుపాకీ బొమ్మ కనిపించింది. సంబరంగా చిప్స్ ప్యాకెట్ అందుకున్న బాలుడు అల్లంత దూరం వెళ్లిపోయి చిప్స్ తింటూ ఆడుకోసాగాడు. అయితే గన్ బొమ్మ కూడా చిప్స్ అనుకున్నాడేమోగానీ ఉన్నట్టుండి దానిని కూడా నోటిలో పెట్టుకుని మింగేశాడు. దీంతో అది గొంతుకు అడ్డుపడిపోయింది. ఊపిరి ఆడక బాలుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే గమనించిన తల్లిదండ్రులు బాలుడి గొంతులో బొమ్మ తుపాకీని తొలగించడానికి ప్రయత్నించారు.ఫలితం లేకపోవడంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డేరింగ్‌బాడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పరుగు తీశారు. అయితే బిగిల్ ఆస్పత్రికి చేరేలోపే దారిలోనే మరణించాడు. ఆస్పత్రిలో డాక్టర్లు పరిశీలించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గొంతులో ఇరుక్కున్న బొమ్మ వల్ల బాలుడి వాయుమార్గం మూసుకుపోయిందని, అందుకే బాలుడు మరణించాడని ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జి వైద్య అధికారి జకేష్ సమంతరాయ్ తెలిపారు. బాలుడి మరణానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.