సాక్షి డిజిటల్ న్యూస్ :బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఇవాళ సీఎంగా 10వ సారి ప్రమాణస్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్‌తో పాటు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా, పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. వారిద్దరికి డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. నిన్న జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకున్నారు. ఎన్నిక కాగానే సీనియర్ నేతలు వెంట రాగా నితీశ్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్ వద్దకు వెళ్లి రాజీనామా సమర్పించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లు దక్కించుకుంది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. 101 సీట్లలో పోటీ చేసి 89 చోట్ల గెలుపొందింది. 101 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. తాజాగా నితీశ్ సహా 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో 14 మంది బీజేపీ నుంచి ఉండగా, 9 మంది జేడీయూకు చెందిన నేతలు ఉన్నారు. లోక్ జన్‌శక్తి (రాంవిలాస్) నుంచి ఇద్దరు, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవులు దక్కాయి. బీహార్‌లో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఇప్పటి వరకు 19 ఏళ్లు పదవిలో ఉన్నారు. 2000 ఏడాదిలో 7 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించడంతో పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
షూటర్‌కు తొలిసారి మంత్రి పదవి.. బీజేపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసి సింగ్‌కు తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఈమె షూటర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. శ్రేయాషి సింగ్ కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. ఆమె తాత కుమార్ సురేంద్ర సింగ్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కూడా. ఆమె తల్లి పుతుల్ కుమారి, మాజీ ఎంపీ. 2020లో బీజేపీలో చేరిన ఈమె.. జముయి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాశ్‌ను 41,000 ఓట్ల తేడాతో ఓడించింది. 2025లో ఆర్జేడీ అభ్యర్థి మొహమ్మద్ షంషాద్ ఆలంను ఓడించారు. శ్రేయసి సింగ్ అంతర్జాతీయ స్థాయిలో ట్రాప్ షూటింగ్ విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్లో రజత పతకం సాధించారు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఆమె చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.