సాక్షి డిజిటల్ న్యూస్ :రైలులో ఎలక్ట్రిక్ కెటిల్‌తో మాగీ వండిన మహిళ వీడియో వైరల్‌గా మారింది. వంట చేయడంతో రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ చర్య భద్రతా ప్రమాదాలను సృష్టిస్తుందని, షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ రైళ్లలో అధిక శక్తి పరికరాల వినియోగాన్ని నిషేధించింది.రైళ్లలో ప్రయాణించే సమయంలో చాలా మంది చాలా రకాల తినుబండాలను తీసుకెళ్తుంటారు. ఎంచక్కా ట్రైన్‌లో హ్యాపీగా తినేస్తుంటారు. అయితే ఓ మహిళ రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీని ట్రైన్‌లో వండుకుంది. అదేలా.. ట్రైన్‌లో గ్యాస్ స్టవ్ వంటివి తీసుకెళ్లనివ్వరు కదా ఆమె మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసిందని అనుకుంటున్నారు. ఆమె కాస్త అతి తెలివి ఉపయోగించి.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో మ్యాగీ ప్రిపేర్ చేసింది. మొబైల్ ఛార్జింగ్ కోసం ట్రైన్‌లో ఉండే సాకెట్‌లో ఎలక్ట్రిక్ కెటిల్ ప్లెగ్ చేసి మ్యాగీ తయారు చేసింది.అక్కడితో ఆగకుండా.. ట్రైన్‌లో వీడియో తీస్తూ మా ఊరి వంట ప్రొగ్రామ్ పెట్టేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో మహిళ మరాఠీలో మాట్లాడుతూ.. కెటిల్ లోపల మ్యాగీ మరిగిస్తున్నట్లు, దాని పక్కన ఒక కప్పు టీ ఉంచి చూపించింది. తన పక్కన ఉన్న సహ ప్రయాణీకుడికి ఈ రెడీమేడ్ అల్పాహారం అందించానని ఆమె పేర్కొంది. నాకు ఇక్కడ(ట్రైన్‌లో) కూడా రెస్ట్ కూడా దొరకదు. నా కిచన్ నడుస్తూనే ఉంటుంది అని ఆమె సరదాగా తెలిపింది. కానీ ఆమె అక్కడితో ఆగలేదు కెటిల్‌లో మ్యాగీ మాత్రమే కాదు గతంలో అదే కెటిల్‌లో దాదాపు 15 మంది ప్రయాణికులకు టీ తయారు చేసినట్లు కూడా తెలిపింది.ఈ వీడియో కాస్త రైల్వే అధికారుల కంట్లో పడింది. వెంటనే ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మహిళ వీడియో త్వరగా వైరల్ కావడంతో ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రైలు పవర్ సాకెట్లు తక్కువ శక్తి గల పరికరాల కోసం ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ కెటిల్‌ల వంటి అధిక శక్తి గల ఉపకరణాల కోసం కాదని చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ అయి ఏదైన ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అంటూ మండిపడ్డారు. వైరల్ వీడియోకు ప్రతిస్పందిస్తూ సెంట్రల్ రైల్వేస్ రైళ్లలో ఎలక్ట్రిక్ కెటిల్‌లను ఉపయోగించడం నిషేధమని, కెటిల్‌లో మ్యాగీ ప్రిపేర్ చేసిన మహిళపై చర్యలు తీసుకుంటామని కూడా ఎక్స్ వేదికగా వెల్లడించారు.