సాక్షి డిజిటల్ న్యూస్ : కడప జిల్లా పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆయనను విధుల నుంచి తొలగిస్తూ.. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్‌లో ఉన్నారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా డీఐజీ ఆదేశాలు మేరకు ఆయనను తొలగిస్తున్నట్లు కర్నూలు SP విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. అలాగే ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. అయితే గతంలో వివేక హత్యకేసు నిందితులు సీఐ శంకరయ్య సమక్షంలోనే ఆధారాలను చెరిపేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సీఎం ఆరోపణలను తోసిపుచ్చిన శంకరయ్య చంద్రబాబుకు లీగల్ నోటీసు కూడా పంపించారు. అంతేకాదు ఈ ఆరోపణలు తన పరువుకు భంగం కలిగిచాయని, అసెంబ్లీ వేదికగా ఆయన తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని అందులో పేర్కొన్నారు. దీంతో కొన్నాళ్లుగా కర్నూలు రేంజ్‌లో వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉన్న శంకరయ్య రాష్ట్ర సీఎంకే లీగల్ నోటీసు పంపడం పోలీసు వర్గాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.