Header Banner

సముద్రపు మోత మళ్లీ వినిపిస్తోంది… భారీ వర్షాలతో రాష్ట్రాలను కుదిపే మరో తుఫాన్

సాక్షి డిజిటల్ న్యూస్ :మరో తుఫాన్ ముంచుకొస్తుంది.  బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడనున్న వాతావరణ వ్యవస్థ కారణంగా ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంపై రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు నవంబర్ 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి ఆ తర్వాత మరింత బలపడి తుఫాన్‌గా మారనుంది తెలిపింది.  ఈ తుఫానుకు సెన్యార్ అంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నామకరణం చేసింది. ఈ తుఫాను నవంబర్ 26 లేదా 27 నాటికి ఏర్పడి నవంబర్ 29వ తేదీలోగా ఉత్తరాంధ్ర తీరం వైపు పయనించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా నవంబర్ 26, నవంబర్ 27వ తేదీలలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని సూచించింది.ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో శనివారం ఆదివారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. నవంబర్ 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.ఇక తెలంగాణలో నవంబర్ 27 లేదా 28 తర్వాత మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కూడా చిరుజల్లులు పడవచ్చని తెలిపింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులను అప్రమత్తం చేస్తున్నారు. వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు పండిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలు అనవసర ప్రయాణాలు చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.ఇదిలా ఉండగా, ఇటీవల తెలుగు రాష్ట్రాలను  'మొంథా' తుఫాను ప్రభావితం చేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలతో పాటు తెలంగాణలోని అనేక  జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.