పుట్టినరోజు సందర్భంగా జరిగిన హంగామా-రోడ్డుపై ఘోర సంఘటన! కత్తులతో

సాక్షి డిజిటల్ న్యూస్ :కుటుంబ సభ్యులు, ఆత్మీయులమధ్య సంతోషంగా చేసుకోవాల్సిన వేడుకలు శృతిమించుతున్నాయి. కొందరు పుట్టినరోజులు పేరుతో చేస్తున్న హడావుడి స్థానికులకు ఇబ్బందిగా మారటంతో పటు పలుమార్లు వివాదాలకు దారితీసింది. తాజాగా తణుకులో కందరు యువకులు కేక్ కట్టింగ్ సందర్భంగా చేసిన హడావుడి తీవ్రదుమారం రేపింది. తల్వార్‌లతో హడావుడి చేయటం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. పుట్టినరోజు వేడుకలు పేరుతో తణుకు పట్టణంలో యువకులు వీరంగం సృష్టించారు. బాణాసంచా, జువ్వలు కాల్చుతూ హంగామా చేశారు. రోడ్లు అత్యంత రద్దీగా ఉండే సమయంలో స్థానిక వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద యువకులు చేరి కేకులు కోస్తూ వేడుకలు చేశారు. అక్కడితో ఆగకుండా కత్తితో విన్యాసాలు చేయటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తణుకు పట్టణానికి చెందిన ఒక యువకుడు తన పుట్టినరోజు వేడుకలు పేరుతో నడిరోడ్డుపై చేసిన హంగామా వాహనదారులు, పాదచారులు, వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. విచ్చలవిడిగా బాణసంచా కాల్చుతూ ఎవరికివారు.. పరిసర ప్రజల ఇబ్బందులను సైతం పట్టించుకోలేదు. ఇదే సమయంలో అటుగా వెళుతున్న పాదచారులు, వాహనదారుల పైకి బాణసంచా దూసుకు రావడంతో భయంతో కొందరు పరుగులు తీశారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇదే సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు సైతం చోద్యం చూస్తూ ఉండిపోవటం వివాదాస్పదంగా మారింది. దాదాపు అరగంటసేపు చేసిన హంగామాతో స్థానికులు హడలెత్తిపోయారు.నిన్న మొన్నటి వరకు జాతీయ రహదారిపై ఇలా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ బాణసంచా కాల్చేవారు. అయితే ఈ సంస్కృతి ఇప్పుడు తణుకు పట్టణం నడిరోడ్డు పైకి విస్తరించడం తణుకు పట్టణ వాసులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఈ హడావుడి హల్చల్ చేయటంతో పుట్టినరోజు వేడుకలు రోడ్ల మీద జరుపుకున్న ఆకుల కళ్యాణ్ తో పాటు పలువురిని తణుకు టౌన్ పోలీసులు స్టేషన్ కి పిలిపించారు. సిఐ ఎన్ కొండయ్య యువకులను పోలీస్ స్టేషన్ తరలించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా వారిపై కేసు నమోదు చేశారు. పుట్టినరోజు వేడుకలు జాతీయ రహదారిపై, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *