సాక్షి డిజిటల్ న్యూస్ :ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బస్సుల్లో పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకోవడం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్..బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో వెనక వచ్చి నెట్టుకుంటూ బస్సు ఎక్కుతున్న వారిని దిగిపోవాలని సూచించాడు. కానీ వారు వినకపోవడంతో.. వారందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డిపో నుండి ఉరుకుంద కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 55 సీటింగ్ ఉండగా, సుమారు 120కి పైగా ప్రయాణికులు ఎక్కారు. ఈ క్రమంలో వారు డోరు వద్ద కూడా వేలాడబడటంతో.. డ్రైవర్ సైడ్ మిర్రర్‌లో నుంచి వెనక వచ్చే వాహనాలను కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఆ రోడ్డు మార్గం అంతగా బాగుండటకపోవటంతో.. ఇంతమంది ఎక్కడం రిస్క్ అని డ్రైవర్ భావించి.. అదే మాటను ప్రయాణికులతో చెప్పాడు. దయచేసి కొందరు దిగాలని కండక్టర్ కూడా ప్రయాణికులకు సూచించారు. కానీ, ప్రయాణికులు వారి మాట వినకపోగా, వారితో వాదనకు దిగారు.దీంతో ఏమి చేయాలో అర్థం కాని ఆర్టీసీ డ్రైవర్ నేరుగా ఆ బస్సును ప్రయాణికులతో సహా పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఆపాడు. పోలీసులకు తన పరిస్థితిని వివరించాడు. దీంతో పోలీసులు పరిమితికి మించి అదనంగా ఉన్న ప్రయాణికులను బస్సులోంచి దించేశారు. అయితే.. తమను ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కించుకొని, ఇలా మార్గమధ్యంలో వదిలేస్తే ఎలా వెళ్లాలంటూ పోలీసులను ప్రయాణికులు ప్రశ్నించారు. ప్రతి అమావాస్యకు ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి వెళ్లాలంటే బస్సు సర్వీసు లేక ఇలా ఇబ్బందులు పడుతూనే ఉన్నామని ఇప్పటికైనా డిపో అధికారులు స్పందించి బస్సు సర్వీస్ లను పెంచాలని వారు డిమాండ్ చేశారు.