సాక్షి డిజిటల్ న్యూస్ :పట్టపగలే కోట్ల రూపాయల క్యాష్‌ను సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని అడ్డగించి.. తాము సెంట్రల్ ఏజెన్సీ అధికారలమంటూ సిబ్బందిని బోల్తా కొట్టించారు. ఆపై కొంత దూరం తీసుకెళ్లి బెదిరించి నగదును లూటీ చేసి ఉడాయించారు. బెంగళూరులో సీఎంఎస్ వ్యాన్ నుంచి రూ. 7.11 కోట్ల భారీ దొంగతనం జరిగింది. జేపీ నగర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ కరెన్సీ చెస్ట్ నుంచి క్యాష్‌ను తీసుకుని ఏటీఎంలో నింపేందుకు వాహనం బయలుదేరింది. బండిలో కస్టోడియన్, డ్రైవర్, గన్‌మాన్ ఉన్నారు. వ్యాన్ అశోకా పిల్లర్ వద్దకు రాగానే ఓ వైట్‌కలర్ టయోటా ఇన్నోవా అడ్డగించింది. అందులోంచి ఐదారుగురు బయటికి దిగి.. తాము ఆర్‌బీఐ అధికారులమంటూ చెప్పారు. సదరు సంస్థపై ఫిర్యాదు ఉందని.. ఆర్‌బీఐ విచారణ జరుపుతోందని.. తమ వెంట రావాలని ఒత్తిడి చేశారు. హఠాత్ పరిణామంతో ఏం చేయాలో పాలుపోక వాళ్లంతా ఆ వాహనంలోకి ఎక్కారు. అటుపై డెయిరీ సర్కిల్ వద్ద వ్యాన్ డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి రూ. 7.11 కోట్ల నగదు తీసుకుని పరారయ్యారు. CCTV ఫుటేజ్ ఆధారంగా ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. స్వయంగా పోలీస్ కమిషనర్ దర్యాప్తు ను పర్యవేక్షిస్తున్నారు అవల్లహళ్లిలో దుండగుల వాహనం చివరిసారిగా కనిపించింది, అక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటన జరిగిన తీరును చూస్తే సీఎంఎస్ ఉద్యోగుల హస్తం కూడా ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంత దర్జాగా దోచుకున్నంది లోకల్ దొంగలా? ఉత్తరాది ముఠాలా? అసలెవరు?? అనేది ఉత్కంఠగా మారింది.